20, నవంబర్ 2008, గురువారం

డా కానూరి హరీష్ స్మృతిలో .........

డా కానూరి హరీష్ స్మృతిలో

.వైద్యవృత్తినివదిలి సమాజానికి శస్త్రచికిత్స చేయడం కోసం ప్రాణాలర్పించిన డా చాగంటి భాస్కరరావు త్యాగం గూర్చి మనకు తెలుసు.పౌరహక్కుల ఉద్యమంలో రాజ్యం కసాయి తనానికి బలి అయిన డా రామనాధం కూడా తెలుసు.వారి స్ఫూర్తితో శాస్త్రీయ అవగాహన, సేవానిరతి, త్యాగం అలపర్చుకొని ప్రజలకు వైద్య సేవలందిస్తూ వచ్చినఖమ్మం పట్టణ ప్రముఖ వైద్యులు డా కానూరి హరీష్‌ మనకికలేరు.వారు సెప్టెంబర్‌ 22, 2006న కన్నుమూసారు.తెలంగాణాలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవారిలో కాకతీయ వైద్య విద్యార్ధుల పాత్రగానీ,ఉస్మానియా ఇంజనీరింగు విద్యార్థుల పాత్రను గానీ తక్కువగా అంచనా వేయలేము.ఆ క్రమంలో డాక్టర్లలో మొదట అమరులయింది డా రామనాధం అయితే రెండో వ్యక్తి డా అంకం బాబూరావు.తెలంగాణా వైద్య విద్యార్ధుల కార్యకలాపాలను గూర్చి రాసేటప్పుడు ఆ ఇద్దరినీ జ్ఞాపకం చేసుకోవాలి.మహోన్నత నక్సల్బరీ, శ్రీకాకుల రైతాంగ పోరాటాల స్ఫూర్తితో కాకతీయ వైద్య విద్యార్ధులు,అందున 1960 - 70 చివర రోజుల్లో ఆ భావాజాలాన్ని అందుకున్న మొదటి తరం వాళ్ళలో డా హరీష్‌ ఒకరు.డా హరీష్‌ 1942 నవంబర్‌ 2న క్రిష్ణాజిల్లా పెదమద్దాలి గ్రామంలో జన్మించారు.ఖమ్మంలో స్థిరపడి, వైద్యవృత్తిని అభ్యసించడం కోసం 1962లో వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో చేరారు.అందరూ ఊహిస్తున్నట్లు వైద్య విద్యార్ధులు కేవలం పుస్తకాల పురుగులు కారని,వారిలో సామాజిక స్పృహ ను రగిల్చితే సమాజానిక వారెంతో సేవ చేయగలరని నిరూపించిన మొదటి తరం విప్లవ విద్యార్ధుల్లో డా హరీష్‌ ఒకరు.ఒక మనిషి కమ్యూనిస్టు అయినప్పుడు కమ్యూనిస్టు సంస్కృతిని ఆచరిస్తాడు.దానికి నిదర్శనంగా వైద్యం చదివే రోజుల్లో వాళ్ళంతా కమ్యూన్‌ జీవితాన్ని అలవర్చుకొన్నారు.అక్కడే డా కావూరి రమేష్‌బాబు, వాసిరెడ్డి రామనాథం తదితరులు వీరి సహ విద్యార్ధులు.వీరంతా 60, 70వ దశకాలలో ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమాల పట్ల సహజంగానే ఆకర్షితులైనారు.కొందరు వ్యక్తులు ఈ సమాజంలో వైరుద్యాల పరిష్కారానికి పోరాటాల ద్వారా రాజకీయరంగంలో ఉండి ప్రయత్నిస్తే, మరికొందరు ‘ప్రజలకుసేవ’ అనే విలువ ద్వారా, ఆచరణ ద్వారా,సాంస్కృతిక రూపంలో సాంస్కృతిక రంగం ద్వారా ప్రయత్నిస్తారు. నాకు తెలిసి ఆచరణ ద్వారా,నమ్మిన విశ్వాసానికి, వ్యక్తిగత ఆచరణకు తక్కువ వైరుధ్యాలున్న వ్యక్తులలో డా హరీష్‌ ఒకరు.ఆ విషయం వారి ఆచరణ, వాళ్ళ ఇంట్లో పనిచేసేవారిని, వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను అడిగితే తెలుస్తుంది.డా హరీష్‌కు సాహిత్య, సంస్కృతిక రంగాలతో గత మూడు దశాబ్దాలుగా ఉంది.ఆయా సంస్థల పట్ల సానుభూతి పరుడుగా ఆయన చేసిన కృషి అసమాన్యమైనది.చారిత్రిక విరసం మొదటి మహాసభ నిర్వహణకాని,రైతు కూలీ సంఘం సభకాని, ”చెరబండరాజు స్మారక పురస్కారం” పేరుతో ప్రగతిశీల కవులకు ఇస్తున్న చేయూత చూస్తే వారి భావ జాలం ఏమిటో తెలుస్తుంది.అసాధారణ ప్రతిభాపాటవాలు ఉన్న వారికి సంగీతం అన్నా, సినిమా అన్నా అత్యంత ప్రీతిపాత్రమైనవి.లక్షలాది రూపాయలతో ఆయన సేకరించిన విలువైన పుస్తకాలు, సినిమాలు, మ్యూజిక్‌ క్యాసెట్లు, ఇందుకు సజీవ సాక్ష్యాలు.మార్కెట్లోకి వచ్చిన ప్రతి పుస్తకాన్ని దాదాపు నాల్గు దశాబ్దాలుగా సేకరించారు.సేకరించిన పుస్తకాలు కేవలం అలంకరణ కోసం కాదని, నిత్యం చదువుతూ,చదివేవారిని ప్రోత్సహిస్తూ, జీవితాంతం పుస్తకాల మధ్యనే గడిపారు. ఆ క్రమంలోనే వారు నాకు అలగ్జాండర్‌ కుప్రిన్‌, ఆల్బర్ట్‌ మురావియో, సాల్‌బెల్లో తదితర రచనలను పరిచయం చేసి ప్రోత్సహించారు.కొందరు తన వారసులకు బంగారం, భవనాలు ఇస్తారు.హరీష్‌గారు తన వారికి లక్షలాది పుస్తకాలను, సినిమాలను,విలువైన పెయింటింగులను ఉదారమైన తన భావజాలాన్ని ఇచ్చి వెళ్ళారు.మంచివిమర్శకులైన హరీష్‌ ‘రామారావు’ పేరుతో మంచి కథలు వ్రాశారు.తానే స్వయంగా ‘స్వేచ్ఛ ప్రచురణ’లు పేరుతో క్రిస్టఫర్‌ కాడ్‌వెల్‌, ఫాలోఫ్రేయిరీ, గ్రాంసీ,ఏ.పి. యట్‌ క్రాస్‌ రోడ్స్‌ తదితర రచనలను తెలుగువారికి అనువదింపజేసి అందించారు.ప్రముఖ విప్లవ కవి ‘శివసాగర్‌ సాహిత్యం’ మొత్తం ఒకే సంకలనంగా వేసినాతో ప్రతి కవితకు పుట్‌నోట్స్‌ వ్రాయించి, అచ్చు వేయించారు.1970 నుండి రావిశాస్త్రి, కారా మాస్టారు, శ్రీపాద, వేగుంట, పతంజలి లాంటి సాహితీవేత్తలను ఖమ్మం రప్పించారు.‘చేరా మాస్టారు అభినందన సభ’కు తానే గౌరవాధ్యక్షులుగా ఉండి గొప్పగా నిర్వహించారు.మితభాషి, సునిశితమైన పరిశీలన కలిగినవారుమన ‘శ్రీశ్రీ’ అనే కవితలో శ్రీశ్రీ గురించి చెప్పడం చరిత్ర ముడివిప్పడం గత కాలపు కందిరీగ తుట్టెను కదిలించడం ఒక శతాబ్దాన్ని ఇంతగా కల్లోలపరిచిన కొద్ది మందిలో శ్రీశ్రీ ఒకరని గొప్ప విశ్లేషణ చేశారు.నేటి మనిషి మానవ సంబంధాలను , అనుబంధాలను డబ్బుతోనే మారకం వేసుకుంటున్నాడనీ, మనిషి పరాయికరణకు గురైన వస్తువని, డబ్బు ఖర్చు పెట్టనిదే మనిషి శవం చుట్టూ చేరి కన్నీరు కార్చడానికి కూడా ఎవరికీ తీరికలేదని,సమాజపు సందుల్లో ఒక రాబోట్‌లా, పందిలా మిగిలాడని, నేడు మరో తెల్ల దేశపు బానిస కాబోతున్నాడనీ, బానిసగా అమ్ముడుపోబోతున్నాడని మానవ నైజాన్ని వివరించారు.చరిత్రలో వెనుక నడిచే వారికి బాట చూపించడానికి నేడు రక్త తర్పణ తప్పదనీ, రక్తంతోనే రహదారి వేయాలనీ,లేకపోతే దారి తప్పుతారనీ, పరోక్షంగా ఈ దేశంలోనే సాయుధ పోరాటాన్ని సమర్ధిస్తూ చెప్పిన విషయాన్ని గమనించవలసి ఉంది. అలాసాగే ఈ క్రమంలో పతితులు, భ్రష్టులూ, మూలనున్న ముసలవ్వలు, దగాపడిన తమ్ముళ్ళు, దౌర్భాగ్యులు మరి జేబుదొంగలు అందరూ ఒకరుగా ఏకంకాక తప్పదనీ, ఈ సమాజం సృష్టించిన దిష్ఠిబొమ్మలు వాళ్ళు అని వాపోయారు. ఎంతో వ్రాయగలిగే సామర్థ్యం ఉండి, వ్రాయకుండా ఉన్న ఆయన నిర్లప్తతను నేను ఒకసారి ప్రశ్నించాను.”నేను ప్రస్తుతం జీవించే జీవితానికి, ఆచరణకు వైరుద్యం ఉందని అందుకే రాయాలని అనిపించడం లేదని చెప్పారు”. అందుకే ఇన్ని వైరుద్యాలున్న ఈ వ్యవస్థలో మనిషి కనుమరుగు అవుతున్నాడని అన్నారు.అయినా వైద్యరంగంలోనే తన జీవిత చరమాంకాన్ని గడిపారు.ఖమ్మం - ఫిలింసొసైటీ, పూలె - అంబేద్కర్‌ నేషనల్‌ ఇన్‌స్టూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, జనవిజ్ఞాన వేదిక, రెడ్‌క్రాస్‌, సాహితీ స్రవంతి, virasam ku sannihitudu gaa ....లింబ్‌సెంటర్‌ తదితర 20 సంస్థలు వెతుక్కుంటూ హరీష్‌ను గౌరవధ్యక్షునిగా చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వారిని ఉత్తేజపర్చింది కమ్యూనిస్టు విప్లవ భావజాలం గనుకనే ఆయన ఇలా ధృడ చిత్తంతో తుదకంటూ తన కృషిని కొనసాగించగలిగారు.ప్రతిరోజు సాయంత్రం స్థానిక ప్రజాశక్తి పుస్తకాల షాపులో సాహితీ మిత్రులతో రెండు, మూడు గంటలు గడిపే అలవాటు. ఎంతో మంది డాక్టర్లు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు ఆ సాయంకాల సమయాన్ని పంచుకొనే వారు.ఆ మిత్ర బృందంలో అత్యంత చిన్న వయస్సు నాదే. ఆయన నా పట్ల ప్రత్యేక వాత్సల్యాన్ని చూపేవారు.ఖమ్మం నెహ్రునగర్‌లోని హరీష్‌ గారి నిలయం ”నెలవంక”. నిత్యం సాహితీ మితృలకు చల్లని పందిరి.కొత్త ఆకాశాలకోసం అరమోడ్సు కళ్ళతో తలపించిన ‘నెలవంక’ కలల్లేని తనంతో వెలవెల బోతూంది.ఇప్పటికీ సాయంకాల సమావేశాలం కొనసాగుతూనే ఉన్నాయి.కాని వారి కుర్చీ ఖాళీగానే ఉంది. ఆ శూన్యాన్ని మేము భరించలేకుండా ఉన్నాం.మా కవి మిత్రుడు షుకూర్‌ మున్నేటి ఒడ్డున విగత జీవిగా ఆయన భౌతికకాయం చితిమంటలలో చూసి చలించి ఇలా చెప్పారు”నువ్వులేవు నీ మాట ఉంది.ఆఖరి సభలో అశువ్రులే పేక్ష్రకులునీ జ్ఞాపకాలు తప్ప ఏవిూ కనిపించలేదుఒక్క నీ మౌనం తప్పఏవిూ వినిపించలేదు”…* * *

కామెంట్‌లు లేవు: